Friday, April 6, 2007

దళిత తత్త్వం

దళితులుగా తమని భావించుకొనే వాళ్ళు -(అసలు ఈ పదం ఎట్లా పుట్టిందో దాని అర్ధం ఏమిటో నాకు తెలియదు)- చాలా మటుకు తాము ఎంతో కష్టాలు, అవమానాలు పడ్డాం అని అవేదన వ్యక్తం చేస్తుండటం మనం చూస్తున్నాం. ఇందులో భాగమే "దళిత కవిత్వం" అనబడే ట్రెండు. ఇవన్నీ చూస్తే ఎవరికన్నా ఏమని అనిపిస్తుందంటే భారత దేశం లో "అగ్ర" వర్ణాల వాళ్ళూ పచ్చి స్వార్ధపరులు, దయా దాక్షిణ్యాలు, మానవత్వం లేని వాళ్ళు అని.
ఎప్పుడూ కూడా అన్ని రకాల వాళ్ళూ సమాజం లో వుంటారు. కాకపోతే పర్సంటేజి లో మార్పు వుంటుంది. రామయణ కాలంలో 10% "చెడ్డ" వాళ్ళు వుంటే ఇప్పుడు 10% మాత్రమే "మంచి" వాళ్ళు కావచ్చు. "మంచి వాళ్ళము" అనుకొనే వాళ్ళలో కూడా అంతా మంచే వుండదు. మానవ సహజము, చుట్టూ వున్న సమాజ ప్రభావ జనితము అయిన దోషాలకు లోను అవ్వటం, తన చుట్టూ వున్న వాళ్ళు accept చేసే customs, behaviour patterns, attitudes అలవాటు చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే "Behaviour is contagious" కాబట్టి.
సమాజం లో వుండే చెడుని గుర్తించే ఆలోచనా శక్తి, సంస్కారము , ఆ చెడుని ఎదిరించి నిలబడి కొత్త మార్గం చూపే శక్తి, సామర్థ్యం, నైతిక బలం అందరికీ వుండదు. అట్లాంటి వాళ్ళు చాలా కొద్ది మందే!!.

-మరి అట్లాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంత వరకూ ఈ దేశం లో పుట్టలేదా?
-అట్లాంటి వాళ్ళు కనీసం గడచిన 1000 సంవత్సరాలలో - అంబేద్కరు, జ్యోతీ రావు ఫూలే కంటే పూర్వం - ఒక్కడూ పుట్టలేదా?
-కనీసం 1% అగ్ర వర్ణాల వాళ్ళు కూడ మంచి వాళ్ళు లేరా?
-అంబేద్కరు కంటే ఎక్కువ కాక పోయినా కనీసం అయనతో సమానంగా దళితోద్ధరణకి పాటు పడిన మహాత్మా గాంధీ కి దళితోద్ధరణ ఉద్యమంలో అంతే పూజనీయ స్ఠానం ఇవ్వ బడుతున్నదా? లేక గాంధీ అగ్ర వర్ణపు వ్యక్తి కాబట్టి ప్రక్కన వుంచబడ్డాడా?
-అస్పృశ్యతా నివారణకై చరిత్ర లో జరిగిన ప్రయత్నాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారా?
-అట్లా చరిత్రలో అస్పృశ్యతా నివారణకి పాటు పడిన వాళ్ళ బోధనలని/ సందేశాలని ప్రచారం చేస్తున్నారా?
-వారు చేసిన మంచి పనులని గుర్తు చేసుకుంటున్నారా?
-కేవలం తమ కష్టాల గురించి, అవే భావాలని, ఆలోచనలని, కొత్త కవితలలో వివిధ సంఘటనల నేపధ్యం తీసుకొని రాయటమేనా లేక ఆ పూర్వులను, వారి త్యాగాలను గుర్తించి గౌరవాదరాభిమానాలతో నిండిన ప్రేమ పూర్వకమైన- ఒక్క మాట, ఒక్క వాక్యం రాస్తున్నారా?

-"మేము దళితులం, మేము దళితులం....బాధలు, అవమానాలు పడ్డాం" అని పాడిన పాటే పాడటం వల్ల అస్పృశ్యత పోతుందా? వర్గాల మధ్య దూరాలు పెరుగుతాయా లేక తగ్గుతాయా? వర్గ బేధాలు సమసిపోయి సామాజిక ఐక్యత సిద్ధిస్తుందా?

-దేశ శ్రేయస్సు, సమాజ హితం ఎందులో వుంది - హక్కుల కోసం, పదవుల కోసం పోరాడటం లో వుందా? లేక సరియైన భావాలని అందరిలో వ్యాప్తి చేసి అందరినీ ఎకోన్ముఖం చెయ్యటం లో వుందా?

చెడు పోవాలంటే మంచిని పెంచాలా లెక చెడో చెడో అని అరవాలా?.

వూరికే నినాదాలు చేయ్యటం అనేది ఇంకా ఇంకా కుల, వర్గ బేధాలను పెంచే పొలిటికల్ స్టంటే తప్ప జాతీయ ఐక్యతకు, దేశాభివృద్ధికి ఎందుకూ పనికిరాదు.

18 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

దళిత సాహిత్యం అని చెప్పబడే దాంట్లో అసలు సాహిత్యమే లేదు. మీరన్నట్లు "మేము దళితులం, మా పూర్వీకులు బాధలు పడ్డారు. మా ఊళ్ళో మమ్మల్ని ఇలా చూశారు, అలా చూశారు." అంటూ రకరకాలుగా వర్ణించడం తప్ప మఱింకేమీ కనిపించదు. గత 15 ఏళ్ళ నుంచి ఇదే వరస. అయినా కులవ్యవస్థకి వ్యతిరేకులమని చెప్పుకునేవారంతా కులాన్ని కులభావనల్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టడం stereotypes ని reinforce చెయ్యడం మటుకే చేస్తున్నారు. వాళ్ళ వాలకం చూస్తే "కులం" నశించడం వాళ్ళకి ఇష్టంలేదనిపిస్తోంది. ఈ మధ్య ఒకాయన అదేదో బ్లాగులో "బ్రాహ్మలు విలన్లు" అంటూ balance తప్పాడు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

అసలు విషయం చెప్పడం మర్చిపోయాను."దళిత" శబ్దం తెలుగు కాదు. ఇది మరాఠీ పదం. మరాఠీలో దళణా అంటే పిండి విసరడం, దంచడం. దళితులంటే పిండికొట్టబడ్డవాళ్ళు దంచబడ్డవారు అని అర్థం. అందుకే నాకీ పదమంటే పరమ అసహ్యం. హరిజనులంటే దీనికంటే శుభ్రంగా ఉంది. కాని గాంధిగారి మీద నిష్కారణ ద్వేషంతో దాన్ని నిషేధించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఒక జాతికి పేరు పెట్టేటప్పుడు వారు బాధలుపడ్డ రోజులకే కాక, తదనంతర కాలంలో వారు ప్రగతి సాధించినప్పుడు కూడా వర్తించేలా మధురంగా శ్రావ్యంగా ఉండాలి. మంచి చెబితే వినేదెవరు ? ఒకప్పుడు "మాల మాదిగ" అంటే SC, ST అత్యాచారాల నిరోధ చట్టం కింద అరెస్టు చేసేవారు. అలా మనకి, అవి వాడే అలవాటు తప్పిపోయింది. ఇప్పుడేమో వాటిని దాన వీర శూర బిరుదుల్లాగా తగిలించుకుని తిరుగుతున్నారు. ఇదంతా తర్కానికి అందని హేతువాదానికి తావులేని వ్యవహారం. అయినా మనకెందుకు పోనివ్వండి. మన మాట ఎవరైనా వింటే గదా !

spandana said...

దళితులుగా తమని తము భావించుకోవడమా..ఇతరులు భావించటం లేదా? మీ అసహనం ఎలా వుంది అంటే "మొగుడు చచ్చి తనేడుస్తుంటే..."లా వుంది.
తమ జాతికి జరిగిన అవమానాలు ఒక్కరోజుతోనో ఒక్క ఏడుపుతోనో ఒక్క ఓదార్పుతోనో పోవు. "అగ్ర" వర్ణాల వాళ్ళు పచ్చి స్వార్ధపరులు, దయా దాక్షిణ్యాలు, మానవత్వం లేని వాళ్ళు అని అనిపిస్తుందని మీ భయం. ఇదెలా వుందంటే కొట్టిన దెబ్బలకు కూతురేడుస్తుంటే "ఛ నోరుముయ్...అందరూ నన్నే చూస్తున్నారు" అని కోప్పడిన అమ్మలా వుంది.
చెప్పి చెప్పి రామాయణ కాలం చెప్పారూ...ఆ మహానుభావుడి కాలంలో 100% దళితులు బాధపడితే కనీసం ఇప్పుడైనా దళితులకు గొంతెత్తే అవకాశమన్నా వుంది.
మీరన్నది నిజమే... ప్రతి మనిషీ తనకు తెలిసి తప్పు చేసి వుండకపోవచ్చు. సమాజ ప్రభావానికి లోనయ్యి సమాజం ఒప్పుకున్న తప్పుల్నే ఒప్పు అనుకొని చేయడం జరుగుతుంది. వీటిని ఎదుర్కొని నిలబడ్డవాళ్ళు ఎప్పుడు వున్నారు.
అన్నమయ్య, వేమన లాంటి వాళ్ళు మానవులందరూ ఒక్కరే అని చెప్పగలిగారు కానీ సముద్రమంత విషంలో ఓ పాలచుక్క ఏమవుతుంది?
గాంధీ అంటే నాకు అమిత గౌరవమున్నా ఆయన కూడా అప్పటి సమాజ సిద్దాంతాలకు లోనయ్యాడు అనిపిస్తుంది (రాముడిలా). అయినా ఆయన చిత్తశుద్దిని నేను శంకించను.
"దళితులం..దళితులం" అంటూ పాదిన పాటే పాడటం మీకంత ఇబ్బందిగా వుందే...నా దేశం..నా సంస్కృతి..మా తాతలు గొప్ప...మా రాముడు గొప్ప అని చేసే వందిమాగదుల కీరతనలు వింటే మీకు ఇబ్బంది లేదా? ఇలా గొప్పలు పోయినంత మాత్రాన అభివృద్ది జరుగుతుందా? సామాజిక ఐక్యత సిద్దిస్తుందా?

తాడేపల్లి గారూ,
అసలు సాహిత్యమంటే ఏమిటి? మన కష్టాలూ, కన్నీళ్ళూ చెప్పుకోకూడనిది సాహిత్యమయితే...ఏ రాజుకు ఎంత మంది భార్యలు? ఎవడి రసికత ఏ పాటిది? ఏ అప్సరస అందమయింది? ఇదేనా సాహిత్యం? ఇలాంటి రంకు భాగోతాలతో మన పూర్వ సాహిత్యమంతా బ్రష్టు పట్టి పోయింది. ఒక సామాన్యుడి కన్నీళ్ళను, కష్టాలనూ తెలపని సాహిత్యం ఎందుకు? గుడిలో పారాయణం చేయడానికా?
కులం పేరు చెప్పుకొని ఏడవడం కులభావనని తీసుకు రావడానికి కాదు. అంటరానితనం గురించో, అమానుషత్వం గురించో చెప్పాలంటే అవి కులంతో విడదీయలేనంతగా వున్నప్పుడు కులానికే అంటుకొని వున్నప్పుడు కులం పేరేత్తకుండా ఎలా చెప్పాలి.
మాలా, మాదిగ వాడటం ఎప్పుడు నిషేధమో ఎప్పుడు ఆత్మ గౌరవ సూచకమో మీలాంటి పండితులకు చెప్పాలా? "మాదిగోడిలా ఏమిటా వేషం...", "మాలోడిలా ఏమిటా..." అంటూ న్యూనత పరిచే ఏ సందర్భంలోనైనా మాల, మాదిగ వాడటం నిషిద్దం. పేరు చివర "శాస్త్రి", "శర్మ", "రెడ్డి", "శ్రేష్టి" లాంటివి తగిలించుకుంటే ఏమొస్తుందని మీరు భావిస్తారో ఆ దృష్టితో "మాల", "మాదిగ" పదాలు చూడగలిగినప్పుడు అవి ఆత్మగౌరవ సూచికలు. ఇది బహుశా మీ వూహకందని విశయం లెండి.

--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య said...

అసలు కులం చెప్పుకోకపోతే ఫలానా వ్యక్తి మాల అని మాదిగ అని ఎలా తెలుస్తుందబ్బా? తెలియకపోతే ఇక ఈ గొడవే ఉండదుగా? ఏమంటారు దళిత సోదర సోదరీమణులు?
ఏరా బాపనోడిలా నెయ్యి మింగుతున్నావు..వాడు కోమిటోనికంటే కంటే పిసినారి..అరవోనిలాగా మాట్లాడొద్దు..మరి వీళ్లందరూ గొడవ చెయ్యలేదేంటబ్బా?

సమానత్వాన్ని సమర్ధిస్తాను..కానీ నేను దళితున్నని వేర్పాటు పడేవాళ్లని ఏమనాలి.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

స్పందన గారి ఆక్రోశం అర్ధం చేసుకోతగ్గది. అరిస్తే కాని అణగారిన జాతుల గోడు ఎవరూ వినరు. కాని అలా అరచేవాళ్ళు దళితుల్లో అగ్ర వర్ణాలవారిగా రూపాంతరం చెంది, కేవలం అరిచేవాళ్ళుగా అయిపోవడం శోచనీయం. అలాంటి వాళ్ళు తమ ఉనికిని కాపాడుకోవడానికి వేరేకులాలని బూచులుగా చూపిస్తున్నారు, తమ పబ్బం గడుపుకొంటున్నారు. అమాయకజనాలు, చదువుకొన్నవాళ్ళు కూడా, మోసపోతున్నారు. దళితులందరూ ఒక్కటవగల్గారా వాళ్ళల్లో కులతత్వం పోయిందా అందరం బాధితులమే కదా అని తమలో సంబంధాలు కలుపుకోగలుగుతున్నారా వీటన్నిటికీ కూడా వేరేవాళ్ళే కారణమనుకుంటూ కూర్చుంటే ఇంకో యుగానికి కూడా పరిస్థితి ఇలాగే ఉండడం ఖాయం. దళితసాహిత్యం వల్ల వారిబాధలకి, కన్నీళ్ళకీ జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అవగాహన కల్గింది. ఇప్పుడు ఇంకోఅడుగు ముందుకేయాల్సిన సమయం. చరిత్రని, జరిగిపోయిన వాటిని తలచుకొంటూ, చీకటిని తిట్టుకొంటూ కూర్చోవడం కాదు.

మన్యవ said...

స్పందన గారు,
1)దళిత సాహిత్యం సాహిత్యమా, లెక పూర్వ సాహిత్యం సాహిత్యమా అన్నది కాదు నా ప్రశ్న.
2)"జాతి" అన్న పదం మొత్తం దేశానికి వర్తిస్తుంది. కాబట్టి జాతి శ్రేయస్సు అంటే దేశ శ్రేయస్సు. అంతేకాని దాన్ని వర్గ శ్రేయస్సు పరంగా వాడితే ఎట్లా?
3)రాముడ్ని, రామాయణాన్ని తప్పు పట్టారు. నేను వాల్మీకి రామాయణం, వ్యాస భారతం చదివాక నా రిప్లై ఇస్తాను.
4)వేదాలను, భారత రామాయణల్ని అంట రానివిగా చూస్తూ వాటి పట్ల అస్పృశ్యత పాటిస్తే దళితులు కూడా అస్పృశ్యతని పెంచి పోషించినట్లేగా.
5)వేద కాలంలో దళితులకు ఇవ్వ బడ్డ స్థానం గురించి ఈ కింద లింక్ లో కొంత సమచారం వుంది.
http://www.geocities.com/ongolesai/psr1.htm

you can also check http://www.saimaster.com/Books/ReadBooks.html . Just FYI.

సత్య గారు, సాయి కొవ్వలి గారు,
సరియైన ప్రశ్నలు వేశారు. చప్పట్లు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

చరసాల ప్రసాద్ గారి పోస్ట్‌లలో అన్నీ ఎదురుదాడులే తప్ప దేనికీ వివరణలు ఉండవు. ఎదురుదాడులు చేస్తే తప్ప విషయాలు అర్థం కానంత తోలుమందం వాళ్ళెవరూ మన బ్లాగరుల్లో లేరు.అవతలి వ్యక్తుల sense of reasoning మీద ఆయనకి ఏదో ఒకరోజు నమ్మకం కలుగుతుందని ఆశిస్తాను.

Sudhakar said...

ఇది ఎటో పోతున్నట్లుంది. సాహిత్యం విషయంలో ఒకటి మాత్రం నాకనిపించింది. అద్భుతమైన పాండిత్యం వున్నా సరే దళిత కవి అనిపించుకోవాలనే వుబలాటం మాత్రం ఇప్పుడు విపరీతంగా వుంది. వారికి ఇంకొక విషయం కనపడడు, మరో పేదోడు కనిపించడు, దేశ సమస్యలు పట్టవు. ప్రపంచంలో వున్న సమస్య అల్లా ఒకే ఒక సమస్య.దళితుల సమస్య. అసలు దళితులని ముద్దుగా పిలవబడే వెనుకబడిన బడుగులు మాత్రం అలానే వున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొక మతంలోనికి మారి ఆదివారం పాటలు పాడుతారేమో గానీ, తోటి దళిత రైతులు సంక్షేమానికి ఏం చేసారు? ఒకడి కంటే మరొకరు ఎక్కువ దళితుడు. దానికోసం కొట్టుకునే పరిస్థితి. కొద్దిగ గొడవ పడితే సిగ్గులేకుండా ఎట్రాసిటి కేసులు బనాయించెయ్యటం. ఇది ఎటుపోతుంది? ప్రతి ఒక్కడూ "దళితులు" అనే కాన్స్పెప్టును నిస్సిగ్గుగా వాడెయ్యటమే. వాళ్ళ ఇళ్లల్లో మాత్రం అప్పిగాడు పాలేరు...లచ్చి పనిపిల్ల. ఇది ఎవరికీ పట్టడు..వారు ఎవరికీ కనిపించరు కూడా.

ఇప్పుడు దళితుడిని నీవు దళితుడివి కావు. నీదే ఈ రాజ్యం నీదే అగ్ర కులం అంటే ఒప్పుకునే పరిస్థితి చస్తే లేరు. వారు ఒక రకమైన బలానికి, అధికారానికి, బానిసత్వానికి దాసులైపోయారు.

spandana said...

రవి గారూ,
మీ వుద్దేశ్యంలో "మాల, మాదిగ" అని ఎవరూ అనకుండా, చెప్పుకోకుండా ఆ పదాలను నిషేదిస్తే ఇక ఈ అస్పృష్యతా, అవమానాలు వుండవంటారు అంతేనా?
మీరు చెప్పిన కోమటి, బాపని, అరవ మాటల్లో కూడా హేళన వుంది. వాళ్ళందరూ కూడా వీదులెక్కి అరిస్తే తప్ప మనం వాటిని మానమా?

దళితులు స్వతంత్ర రాజ్యం ఇమ్మనటం ఎక్కడా లేదే? అధిక సంఖ్యాకులమైన మమ్మలని అల్ప సంఖ్యాక వర్గాలు ఎలా పాలిస్తాయి, రాజ్యం హక్కులో మా వాటా మాకు కావాలి అంటున్నాయి. హక్కులో వాటానే కానీ రాజ్యంలో వాటా కాదు. ఒకనికి పుట్టిన సోదరులే వాటాలు అడుగుతున్న రోజుల్లో దళితులు అడగడంలో తప్పేముంది?

సత్యసాయి గారూ,
మీరు చెప్పినదాంతో నేను ఏకీభవిస్తాను. అరిస్తేగానీ ఎవడూ పట్టించుకోడు. అయితే ఆ అరిచేవాడు ఆ ఫలితాన్ని పొందుతూ వుండటం అన్ని వర్గాల్లోనూ కులాల్లోనూ వున్నదే. దళితులు వేరే ఎవ్వరో కాదు కదా? అన్ని కులాల్లో వున్న జాడ్యమే ఈ కులాల్లోనూ వుంది. రెడ్లలో ఎన్ని ఉప కులాలు? ఈ రెడ్లు ఎక్కువా ఆ రెడ్లు తక్కువా అనుకోవడం ఏ ఉపకులం వాళ్ళు ఆ ఉపకులం లోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా? అలాగే మాదిగలు తమ కంటె మాలలు తక్కువనీ లేకుంటే ఇంకోలానో అనుకుంటారు. ఇలా విభజనలో విభజన అందులో మళ్ళీ విభజన వుంటేనే కదా ఎవ్వరూ సంఘటితంగా వుండలేక పోయేది?
తిడుతూ కూర్చుంటే ఫలితం లేదు నిజమే. దళితులు తమలో తాము మార్పు ముందు తెచ్చుకోవాలనడంలో మీతో నేను అంగీకరిస్తాను.

మన్యవ గారూ,
1)మీరు "...అవమానాలు పడ్డాం అని అవేదన వ్యక్తం చేస్తుండటం మనం చూస్తున్నాం. ఇందులో భాగమే "దళిత కవిత్వం" అనబడే ట్రెండు." అన్నప్పుడు ఈ తరహా కవిత్వం కవిత్వం కాదని మీ వుద్దేశ్యమేమొ అని అలా అన్నాను.
2)"జాతి" శ్రేయస్సు గురించి ఆలోచించాలంటే ముందు తన శ్రేయస్సు బాగుండాలి. నువ్వు మనిషివే కాదు పొమ్మనే సమాజంలో ఆ సమాజం శ్రేయస్సు గురించి ఏం మాట్లాడతాం? అసలు జాతి శ్రేయస్సు ఎప్పుడు బాగున్నట్లు? ఆ జాతిలోని అన్ని వర్గాలూ బాగుంటేనే కదా?
3)ఏవో కొన్ని ప్రాధమిక ధర్మాలు తప్ప మనం ధర్మాలుగా చెప్పుకొనే చాలా ధర్మాలు కాలాన్ని బట్టి మారుతూ వస్తున్నాయి. పతితో పాటు సతి మరణించడం ఒకనాటి ధర్మమైతే అది ఈనాడు దురాచారం. అలాగే వర్ణ సంకరం జరక్కుండా నిరోధించి వర్ణ పవిత్రతను కాపాడటం, ఏ కులానికి విధించిన విధిని నోరెత్తకుండా ప్రతి కులం విధిగా పాటించడం రామాయణ కాలం నాటి ధర్మం. దాన్నే రాముడు కాపాడాడు. అందుకు రామున్ని నిందించాల్సిన పని లేదు. అది ఆనాటి ధర్మం గనుక ఆయన దాన్నే పాటించాడు. అయితే అదే ధర్మమని ఈరోజూ ఒప్పుకోమంటే కష్టం. మీరు రామాయణం చదివాకే రండి వివరంగా చర్చిద్దాం.
4)భలే చమత్కారం చేస్తున్నారు మీరు. సింహం దగ్గరకో పులి దగ్గరకో వెళితే అది నన్ను తినేస్తుంది. అందుకని నేను సింహాన్నో, పులినో ముట్టుకోవట్లేదని నాది తప్పంటారా? వేద కాలంలో నాకు తెలిసి ఈ వర్ణభేదాలూ, అస్పృష్యతలూ లేవు. వాటిమీద మాట్లాడే అధికారం నాకు లేదు. కానీ రామాయణ, భారతాలలో భోధించిన మార్గం నా మార్గానికి పరమ వ్యతిరేకమయిందయితే వాటిని నేనెందుకు దూరంగా వుంచకూడదు? కానీ దళితుల అంటరానితనానికి ఇలాంటి కారణాలు లేవే? వాళ్ళు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కాసిన్ని నీళ్ళూ చిలకరించి స్వీకరిస్తారే మరి వాళ్ళేం పాపం చేశారని అంటారానివారయ్యారు?
5)మీరిచ్చిన లింకులు తప్పకుండా చదువుతాను. కృతజ్ఞతలు.

సత్యసాయి గారికి నా చప్పట్లు కూడా.

తాడేపల్లి గారూ,
మీరే అన్నట్లు నేను "ప్రతిదాడులు" చేస్తున్నానే గానీ "దాడులు" కాదు కదా?
నేనింకేమి వివరణ ఇవ్వగలను? "మేము దళితులం, మా పూర్వీకులు బాధలు పడ్డారు. మా ఊళ్ళో మమ్మల్ని ఇలా చూశారు, అలా చూశారు. అంటూ రకరకాలుగా వర్ణించడం తప్ప మఱింకేమీ కనిపించదు." అంటూ మీరు దాడి చేసినప్పుడు నేను మీ భావంతో అంగీకరించనపుడు ఎదురుదాడి చేయక ఏంచేయను? దళితులు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ భాధలు తప్ప "మఱింకేం" వునాయి చెప్పుకోవడానికి, పాడుకోవడానికి? (ఇది వివరణ కూడానా? ఎదురుదాడి మాత్రమేనా?). నేనెప్పుడైనా అక్రమంగా వాదిస్తుంటే సహేతుకంగా చెప్పండి నేను తప్పకుండా నా తప్పును అంగీకరిస్తాను.

సుధాకర్ గారూ,
మీ భాధ క్రీమీ లేయర్‌కు చేరిన కొద్దిమంది దళితుల గురించి అయినట్లుంది. వెనకబడి వున్న అసలు దళితుల గురించి మీకున్న బాధే నాకున్న బాధానూ.
దళిత కవిత్వం గురించి మాత్రం మీ అభిప్రాయంతో విభేదిస్తాను. దళిత కవి అనిపించుకోవాలనే ఉబలాటంతో దళిత కవిత్వం రాస్తున్నారంటే నేను నమ్మను. ఈ కొన్ని సంవత్సరాలలో "దళిత" పదానికి "బ్రాహ్మణ" పదమంత పవిత్రత అబ్బిందంటే నేను నమ్మను. దేశ సమస్యల గురించీ, ప్రపంచంలో వున్న అనేకానేక సమస్యల గురించీ రాస్తున్న వాళ్ళు అనేకులున్నారు...కానీ దేశ సమస్య అయిన దళిత సమస్య గురించి దళిత కవులే గదా రాస్తున్నారు.

ఇక్కడే చూడండి నా గొంతుక ఒక్కటి మీ గొతుకలిన్ని. :)

--ప్రసాద్
http://blog.charasala.com

Sudhakar said...

నా భావం మీకు అర్ధం అయినట్లు లేదు. :-) నేను దళిత కవిత్వం ఏదో గ్లామర్ ను సంతరించుకుంటుంది అనటం లేదు. సాహిత్యంలో పెరుగుతున్న పోకడల గూర్చి నేను గమనించినది చెప్పాను. వేరేగా దళిత సాహిత్యం అంటే ఏమిటో నాకిప్పటికీ అర్ధం కాదు. పాలేరు అగ్రవర్ణానికి చెందితే వాడి కష్టాలు వేరేగా వుంటాయా? దళితులకు వేరేగా వుంటాయా? బడుగులందరూ దళితులేనా అనేది నా ప్రశ్న. అలాంటప్పుడు ప్రతీ ఒక్కరు దళిత కవిని అని చెప్పుకోవటానికి "పవిత్రతే" కారణం కానక్కరలేదేమో? పేదోడంటే దళితుడనే తప్ప్పుడు ప్రచారానికి ఆరాటం కాదా?

ఇక దళితులలో క్రీమీ లేయర్ వదిలేస్తే...మామూలు పేద దళిత విద్యార్ధులలో కూడా ఇతర దళిత కులాల మీద ఎక్కడ లేని ద్వేషం. వీరు ధూమ్ ధామ్ అంటే, వారు దండోరా అంటారు. వీరందరి మధ్య నలిగి పోతున్న అసలు పేదోడు మాత్రం చితికిపోతూనే వున్నాడు...ఈ దళిత సాహిత్యానికి ఒక వస్తువుగా వుపయోగపడుతున్నాడు.

వీరందరి కంటే ఏ కవిత్వం రాయకపోయినా అప్పుడప్పుడు వెళ్లి వాళ్లకు చదువు చెప్పి, వైద్య సహాయాలు చేసే మా సాఫ్ట్ వేర్ నిపుణులే నయం. చెప్పటం తేలిక, చెయ్యటం కష్టం.

మన్యవ said...

i changed my mind.
రామాయణం చదివాక కూడా నాకు మీతో చర్చించాల్సింది ఏమీ లేదు atleast regarding this topic.

రాధిక said...

కులాల పేరుతో రిజర్వేజన్లు,స్కాలర్షిప్పులు తీసుకుంటున్నప్పుడు కులం తో సంబోధిస్తే ఎందుకు తప్పవుతుంది?అగ్రకులాల్లో కూడా ఆర్ధికం గా వెనుకబడిన వారు చాలా మందే వున్నారు.ఒక పూటకి కూడా తిండి లేక ,పిల్లల చదువులకి స్కాల్రషిప్పులు రాక,రిజర్వేషన్లు లెక చాలా మంది దళితుల కంటే అద్వాన్నం గా బ్రతుకుతున్న వాళ్ళు కోకొల్లలు.కులం తెచ్చిపెట్టిన దర్పం వల్ల అప్పులు చేయలేక,రోడ్డున పడి బతక లేక ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా?వెనుక బడిన కులాలలో చాలా మంది ఇప్పుడు మంచి ఉధ్యోగాలలో వుంటూ మంచి గౌరవం పొందుతున్నారు కదా.అగ్రకులాల్లో తిన్న తినక పోయినా పిల్లలకి చదువులు చెప్పించి వ్రుద్దిలోకి తీసుకొచ్చి గుట్టుగా బ్రతుకుతుంటే , దళితులు మధ్యాన్న భోజనం కోసం,నెలకోసారి ఇచ్చే బియ్యం కోసం పిల్లలని స్కూలుకి పంపిస్తూ మిగిలిన రోజుల్లో పనికి పంపే వారే అందరూ.అగ్రకులాలూఅ నెలకి 2000 వచ్చినా,దళితుల్లో రోజుకి భార్యా భర్తలిద్దరికీ 100 చొప్పున వచ్చినా ఇద్దౌఉ ఒకే జీవితాన్ని ఎందుకు గడపలేకపోతున్నారు.ఒకళ్ళు పొదుపు చేస్తుంటే,ఇంకొకళ్ళు ఏరోజు వచ్చింది ఆరోజే అన్నట్టు వుంటున్నారు.మొన్నే మన తెలుగు బ్లాగరొకరు ఒక కధ రాసారు.చీమ దొరికినంతకాలం కష్టపడి పొదుపు చేసి దాచుకుని కరువుకాలం లో ఉపయోగించుకుంటుంటే,మిడత దొరికినంతకాలం ఎంజోయ్ చేసి కరువు కాలం లో చీమని చూపి దాని ఆహారాన్ని డిమాడ్ చేసిందట.

spandana said...

సుధాకర్ గారూ,
"పాలేరు అగ్రవర్ణానికి చెందితే వాడి కష్టాలు వేరేగా వుంటాయా? దళితులకు వేరేగా వుంటాయా? బడుగులందరూ దళితులేనా అనేది నా ప్రశ్న" ఖచ్చితంగా అగ్రవర్ణ పాలేరు కష్టాలు వేరేగా వుంటాయి.
అగ్రవర్ణ పాలేరు ఇంట్లో కూర్చుని అందరితో పాటో లేదంటే అదే చోటో తింటాడు.
దళిత పాలేరు గొడ్ల చావడిలో పైనుంచి దోసిట్లో పడేస్తుంటే చేతిలో పెట్టుకొని తినడమో లేక తనకోసం గొడ్ల కొట్టంలో చూరులో దాచిన సత్తు గిన్నెలోనో తింటాడు. (గొడ్లకంటే హీనంగా) అగ్రవర్ణ పాలేరు కష్టంలో వుంటే అందరికీ వింటే అయ్యో గొప్పకులమోడు కష్టపడుతున్నాడే అని.
దళిత పాలేరు కష్టంలో వుంటే అది సహజం ఎవ్వరికీ నొప్పి వుండదు.
"పేదోడంటే దళితుడనే .." పేదోడంటే దళితుడని ఎవరన్నారు? దళితుడంటే పేదోడు అంటారు గానీ.
మామూలు పేద దళిత విద్యార్థుల్లోనే కాదు ఈ తరహా ద్వేషాలు అన్ని కులాల్లోనూ వున్నాయి. కాదంటారా?
కవిత్వం చేసే పని కవిత్వం చేస్తుంది, చదువు చెప్పేవారు చదువూ చెబుతారు. అందరూ ఒకేపని ఎలా చేస్తారు? ముల్లు గుచ్చుకుంటే కన్నీళ్ళూ వస్తాయి, బాధా కలుగుతుంది. కన్నీళ్ళు కారిస్తే ఏమి లాభం ముల్లు తీసివేయాలి గానీ అంటే ఎలా?

"వీరందరి కంటే ఏ కవిత్వం రాయకపోయినా అప్పుడప్పుడు వెళ్లి వాళ్లకు చదువు చెప్పి, వైద్య సహాయాలు చేసే మా సాఫ్ట్ వేర్ నిపుణులే నయం." -- నయమే. నేనూ మీలో ఒకన్ని.
"చెప్పటం తేలిక, చెయ్యటం కష్టం." -- అవును. అంగీకరిస్తాను.

--ప్రసాద్
http://blog.charasala.com

మన్యవ said...

ఆయన మాట్లాడుతున్నది హక్కుల గురించి, రాజ్యాధికారం లో వాటా గురించి, పేద వాడి గురించి కాదు.

Unknown said...

నేను కూడా ఈ దళిత అని విడదీసి మాట్లాడే దానికి వ్యతిరేకమే. ఆ మాటకొస్తే ఏ విధంగా నయినా విడదీసి మాట్లాడే వారన్నా నాకు పడదు. నేను రోజూ ఎంతో మంది కులాల, మతాల వారితో కలిసి పని చేస్తున్నా. గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలను ఏ నాడూ నేను నా పక్కనున్నవాడు ఏ కులం, ఏ మతం అనే ఆలోచన రాలేదు. దానిని బట్టి నేను ఎప్పుడూ judge చెయ్యలేదు.

నేను సహాయం చెయ్యగలిగితే నా పరిధిలో ఏ రాష్ట్రం, ఏ కులం, ఏ మతం అనేది నేనెప్పుడూ పట్టించుకోలేదు.

తప్పులుంటే గొంతు వినిపించడానికి నేను వ్యతిరేకం కాదు. వినిపించాలి.
కానీ నాకు వీటిలో నచ్చనిదేమిటంటే మంచి ఎప్పుడూ కనపడేలా చెప్పి దానిని ప్రోత్సాహించరు. చెడు ని మాత్రం మైకులో అరుస్తారు. ఇది ఈ ఒక్క విషయం లోనే నేను చెప్పట్లేదు ఏ విషయం లో నయినా సరే.

మరి ఇంత మంది కుల భేదాలు లేకుండా సహ జీవనం చేస్తుంటే వారి గురించి ఎవరూ రాయరే. ఇదంతా సమాజంలో భాగం కాదా ?

సుధాకర్ గారు అన్న దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. చెప్పడం సులువు, చెయ్యడం కష్టం. ఏ జాడ్యాలూ పాటించకుండా మన వంతు మనము చేస్తున్నామని నా అభిప్రాయం.

ఇంకా కొంత మంది మనుషుల్లో మార్పు రాకపోయి ఉండవచ్చు. కానీ ఏదో అగ్ర కులాల వారు తమని దోచేస్తున్నట్టు అందరినీ ఒకే గాటిన కట్టెసే సాహిత్యం సరయినది కాదు.

మీరు పైన అన్నారే ఇక్కడ కూడా నా గొంతుక ఒక్కటి, మీ గొంతుకలిన్ని అని అది కూడా నాకు నచ్చలేదు. అభిప్రాయం చెప్పకుండా ఎవరూ ఎవరినీ ఆపలేదు.

Sudhakar said...

ప్రసాద్ గారు, మీరన్నవాటితో ఇప్పుడు నాకు అర్ధం అయింది, ఏకీభవిస్తాను. కానీ నాకు ఈ కాన్సెప్టు మీద ఎక్కడో మాత్రం కొద్దిగా చిరాకు మాత్రం అనిపిస్తుంది. ఎందుకనేది నాకే తెలియదు. తరతరాలుగా వస్తున్న అగ్రకులాల అహంభావం అని మాత్రం అనవద్దు :-). మీరన్న సానుభూతి కొన్ని సార్లు చూసాను. కానీ అన్ని చోట్లా కాదు. అగ్ర వర్ణ కుటుంబాలలో మమేకమై ఒకరిగా జీవించిన ఎంతో మంది దళితులను నేను చూసాను..అందుకే నాకు కొద్దిగా సమయం పట్టింది...Big Picture అర్ధం చేసుకోవటానికి :-)

సమానత్వం సాధించే దిశగా నడవటం పోయి, వేర్పాటు దిశగా ప్రయాణిస్తున్నదేమో దళితం అనిపిస్తుంది. 93 BC కులాల ఐక్యవేదిక అని ఏదో చేస్తున్నారిప్పుడు...ఇన్ని కుల సంఘాలున్నాయా అని ఆశ్చర్యం వేసింది. అది మంచి పరిణామామా కాదా లేదా నాకు తెలియదు కానీ, "పిచ్చివాడిని పిచ్చివాడిగానే ఎదుర్కోవాలి" అనే సూత్రంగా కనిపిస్తుంది నాకు. రాను రాను కుల పిచ్చి అతి శక్తివంతంగా మారుతున్నట్లనిపిస్తుంది. అది రాజకీయనాయకులకు చాలా మంచి పరిణామం. ప్రధాన పార్టీలను నాయకులైన అగ్రవర్ణాల వారిది అదే కోరిక. అదే నన్నెపుడూ కలవరపెడుతుంది.

మన్యవ గారు, మీరు రామాయణం చదవకూడదండి. రామాయణ విష వృక్షం చదవాలి. మహా గ్రంధం అని చెప్పలేను, మంచిది అని చెప్పలేను. కానీ కొన్ని తార్కికాలు అబ్బురపరుస్తాయి, ఆలోచింపచేస్తాయి. పోను పోను బోరు కొడుతుంది ..అది వేరే సంగతి :-)..రామాయణమే కాదు..చాలా గ్రంధాలు రాజు చుట్టూ తిరిగి ప్రజలను విస్మరించాయి. వారేమి వండుకు తినేవారో తెలియదు, నాగరికతా తెలియదు. అసలు రాముడు, కృష్ణుడు మన ద్రవిడ జాతికి చెందినవారే కాదు. ద్రవిడ ప్రాంత వెనుకబాటును ఆసరాగా తీసుకుని మన మీద రుద్దబడిన చరిత్రనాయకులు అని నా గట్టి నమ్మకం. అశోకుడు చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను అని చదువుతామే గానీ, రాముడు చెట్లు నాటించెను, కృష్ణుడు కాలువలు త్రవ్వించెను అని ఎందుకు చదవం? అది సాహిత్యం మహిమ. రాజుని కీర్తించటం అనేది, రాజుని దైవ ప్రతినిధిగా, అది కాకుంటే ఏకంగా దైవంగా కీర్తించడం అప్పటి నాగరికతా లక్షణం. ఇది రోమన్లలో కూడా కనిపిస్తుంది.
బ్లాగు అంశం నుంచి దొర్లిపోయినట్లున్నాను. క్షమించండి :-)

Sudhakar said...

ప్రసాదు గారు…

"దళితుడంటే పేదోడంటారు గానీ…" అని అన్నారు మీరు...ఇదే కదా అసలు సమస్య. ప్రతీ ఒక్కడు నేను దళితుడిని ….అందువలన నేను పేద వాడిని కూడా అని అచ్చంగా పేదోడయిపోయి ఆనందిస్తున్నారు. మీరు చెప్పిన ఈ సమీకరణం ఎల్ల వేళలా బ్రతికి వుండటానికి ఈ రాజకీయపార్టీలు, దళిత "మేధావులు" విశ్వప్రయత్వం (విజయం సాధించారు కూడా)…చేస్తున్నారు.

దళితులందరూ పేదోల్లా…రిజర్వేషన్లు అమలై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా? అలా అని అగ్ర వర్ణాలందరూ ధనలక్శ్మి నెత్తిమీద కూర్చున్న వాళ్లా?


అసలు పేద , ధనిక అని రెండు వర్గాలుంటే ఏమవుతుంది? అన్ని సమస్య్తలు తీరుతాయి కదా..? ప్రభుత్వం అసలు కులాన్ని ఎందుకు పట్టించుకోవాలి?

Dr.Pen said...

దళిత శబ్ధంపై, దళిత వాదంపై చర్చ కొన్ని పేజీలు కాదు, కొన్ని రోజులు కాదు...ఎన్నో ఉద్గ్రంథాలు, ఎన్నో తరాల పాటు జరిగే అవకాశం ఉన్న రచ్చ!

ఈనాటి 'ఈనాడు'లో ఈ ఒక్క వార్త చాలు...ఇలా చేయాల్సిన అవసరం అసలెందుకొచ్చిందో...మీ విచక్షణకే వదిలేస్తున్నా!

తితిదే 'దళిత గోవిందం'
సహపంక్తి భోజనాలు
తిరుపతి,ఏప్రిల్ 7,2007
(ఈనాడు)

మనదేశంలో సుమారు 40 కోట్ల మంది హిందువులు ఆలయాలను దర్శించలేని స్థితిలో ఉన్నారని తితిదే పాలకమండలి ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి అన్నారు. అనాదిగా ఒక వర్గంపై సమాజంలో అంటరానివారిగా ముద్రవేశారని, పర్యవసానంగా మతమార్పిడులకు సానుకూలత ఏర్పడిందని శుక్రవారమిక్కడ తెలిపారు. ఈ స్థితిలో హిందూమత పరిరక్షణకు తితిదే ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం తలెత్తిందని తెలిపారు. తొలి విడతగా రాష్ట్రంలో 'దళిత గోవిందం' పేరుతో దళితవాడల్లో శ్రీవారి కల్యాణం, దళితులకు వేదపండితుల ఆశీర్వచనాలు ఇప్పించడంతో పాటు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా సోమవారం వేమూరులో దళిత గోవిందం ఉంటుందన్నారు. తాము ప్రస్తుతం దళితులకు ఆలయ ప్రవేశం కల్పించే కార్యక్రమం చేపట్టడం లేదని ఆయన స్పష్టీకరించారు. హిందువుల్లోనే ఒక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు ఇతర మతాలవైపు మొగ్గుచూపుతున్నారని వివరించారు. దీన్ని నివారించి మతమార్పిడులను అరికట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులతో కలసి వేమూరుకు వెళతామన్నారు. అక్కడ శ్రీవారి కల్యాణం జరిపి, దళితులకు వేదపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించాక సహపంక్తి భోజనాలు చేస్తామని తెలిపారు.

(ఇన్నాళ్లకైనా... ఇన్నేళ్లకైనా...ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ...)


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger